తిరుమల: శ్రీవారి భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పెద్దపీట వేసింది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఐసీ ద్వారా భక్తులకు ప్రత్యేక బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించే భక్తుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అంతేకాకుండా, సహజ మరణానికి సైతం రూ.2 లక్షలు అందజేసేలా గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం నిమిత్తం ఎల్ఐసీకి టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
అలాగే తిరుమలలో అన్న ప్రసాద కేంద్రం, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలతో బయో గ్యాస్ తయారీ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను రూ.2.80 కోట్లతో ఎం/ఎస్ జీపీఎస్ రెనెవెబుల్స్‌కు అప్పగించారు. శ్రీవారి పోటులో లడ్డూల తయారీని వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. పారిశుధ్య కార్మికుల రవాణా ఛార్జీల నిమిత్తం 3 ఏళ్లకు రూ.1.60 కోట్లు కేటాయించగా, గత బ్రహ్మోత్సవాల సమయంలో ఎఫ్‌ఎంఎస్ కార్మికులకు లడ్డూ, వడ ఇవ్వాలని నిర్ణయించారు. నారాయణవనం, చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాల్లో బంగారు తాపడ పనులకు రూ.17.05 కోట్లకు పైగా ఆమోదం తెలిపారు. సీపీఎస్/ఎన్‌పీఎస్ పెన్షనర్లకు ఈహెచ్‌ఎఫ్ సౌకర్యం కల్పిస్తూ రూ.2 కోట్ల యాజమాన్య వాటాకు ఆమోదం తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండో విడతగా రూ.7.56 కోట్లు విడుదల చేయడంతో పాటు, వైద్య ఖర్చులు చేసిన ఉద్యోగులకు రూ.54.66 లక్షల రీయింబర్స్‌మెంట్‌కు బోర్డు ఆమోదముద్ర వేసింది.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.