Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ: ఒక్కరోజే ఐదు కోట్ల పైగా హుండీ ఆదాయం

మన పత్రిక, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, భక్తులు బయట ఉన్న క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారికి భారీగా కానుకలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే మొత్తం 82,105 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 34,484 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ. 5.18 కోట్లుగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement