మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ. 10,120.78 కోట్లను జమ చేస్తోంది. ఒక్కో విద్యార్థి తల్లికి రూ. 13,000 చొప్పున అందుతున్న ఈ నిధుల జమ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, పిల్లలే మన అసలైన సంపదని, వారి చదువులే కుటుంబానికి తరగని ఆస్తి అని అన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ సాయం అందజేయడం వల్ల విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆయన తెలిపారు. గతంలో ఉన్న ఆంక్షలను తొలగించి, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతోందని, పిల్లల చదువు కోసం శ్రమిస్తున్న తల్లులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
