Advertisement

హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

మన పత్రిక: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు Sonam Raghuvanshi బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ పీవీ వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నిందితురాలు మూడు వారాల్లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ దశలో నిందితురాలు బెయిల్‌పై బయట ఉంటే కేసు విచారణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ రాబోయే ఆరు నెలల్లో విచారణ పూర్తి కాకపోతే, ఆమె మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలో అరెస్టు మెమోలో సాంకేతిక లోపాలు ఉన్నాయనే కారణంతో హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, అది కేవలం టైపింగ్ పొరపాటని, తీవ్రమైన హత్య కేసులో అలాంటి కారణాలతో బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్‌ను రద్దు చేసింది.

Advertisement

ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ రఘువంశీ 2025 మే నెలలో హనీమూన్ కోసం మేఘాలయలోని సొహ్రా ప్రాంతానికి వెళ్లారు. మే 23న వారిద్దరూ కనిపించకుండా పోగా, జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోతైన లోయలో లభ్యమైంది. పోలీసులు జరిపిన దర్యాప్తులో సోనమ్ తన ప్రియుడు రాజ్‌కుమార్, సుపారీ గ్యాంగ్‌తో కలిసి భర్తను హత్య చేయించినట్లు తేలింది.

Advertisement