మన పత్రిక: నీట్ (NEET) పేపర్ లీకేజీ అక్రమాలపై నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో తనను పరామర్శించి దీక్ష విరమించాలని కోరిన సందర్భంలో, మంత్రులు కొన్ని హామీలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యాశాఖ మంత్రి రాజీనామా, పార్లమెంట్లో జవాబుదారీతనంపై చర్చ వంటి అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రులు హామీ ఇచ్చారని వాంగ్చుక్ తెలిపారు.
యువతపై కేసులు పెట్టవద్దు
జూలై 20న జరిగిన ‘సంసద్ చలో’ మార్చ్ ప్రశాంతంగా సాగిందని, పోలీసులు బలప్రయోగం చేసినా విద్యార్థులు సహనంతో ఉన్నారని సోనమ్ వాంగ్చుక్ గుర్తుచేశారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువతపై ఎటువంటి కేసులు, వేధింపులు లేదా ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని ఆయన డిమాండ్ చేశారు. సుమారు 65 మంది పార్లమెంట్ సభ్యులు తనను కలిసి దీక్ష విరమించాలని కోరారని, తాను తిరిగి విద్యార్థుల వద్దకు వెళ్లాలని భావిస్తున్నానని, అయితే యువత ప్రయోజనాలను పక్కనబెట్టి ఆ పని చేయలేనని ఆయన వివరించారు. ప్రభుత్వం తన విజ్ఞప్తిని, యువత ఆకాంక్షలను ఆలకించిందని భావిస్తేనే దీక్ష విరమిస్తానని, లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షను నిరవధికంగా కొనసాగిస్తానని వాంగ్చుక్ హెచ్చరించారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
