Advertisement

సొంత మనుషులే ఎదగకుండా అడ్డుపడతారు: శోభితా ధూళిపాళ్ల

మన పత్రిక: జీవితంలో కొత్త మార్గాన్ని ఎంచుకుని విజయం సాధించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లపై నటి శోభితా ధూళిపాళ్ల స్పందించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పంచుకున్న వీడియోపై ఆమె స్పందిస్తూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొత్త వ్యాపారం లేదా సరికొత్త రంగాన్ని ఎంచుకున్నప్పుడు సొంత సమాజం నుంచే మద్దతు కరువవుతుందని, దగ్గరి వారే పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఈ అంశంపై శోభిత స్పందిస్తూ తన వ్యక్తిగత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను 16 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి ముంబైకి వెళ్లానని తెలిపారు. అప్పట్లో విజయం సాధిస్తాననే గ్యారెంటీ లేకపోయినా, తన లక్ష్యాల కోసం ధైర్యం చేసి ముందుకు అడుగు వేశానని ఆమె వివరించారు. కష్టపడి పైకి రావాలనుకునే వారికి, ముఖ్యంగా మహిళలకు సమాజం నుంచి మరింత ఎక్కువ వ్యతిరేకత ఎదురవుతుందని శోభిత పేర్కొన్నారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, ఆశయాల సాధనకు బయలుదేరే వారికి సమాజం నుంచి మద్దతు లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

శోభితా ధూళిపాళ్ల ఇటీవల ‘చీకటిలో’ చిత్రంలో నటించారు. కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వదేవ్ రాచకొండ కథానాయకుడిగా నటించగా, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement