Advertisement

సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సుప్రియ యార్లగడ్డ నియామకం

మన పత్రిక: కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) బోర్డును పునర్వ్యవస్థీకరించింది. వినోద రంగం, సృజనాత్మక రంగాలకు చెందిన 18 మంది ప్రముఖులతో కూడిన నూతన ప్యానెల్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 సెప్టెంబర్ 16న ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వచ్చాయి. కొత్తగా నియమితులైన సభ్యులు మూడేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవుల్లో కొనసాగుతారు.

నూతనంగా ఏర్పాటైన ఈ బోర్డులో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు చోటు లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ నిర్మాణ రంగంలో కొనసాగుతున్న ఆమెకు ఈ నియామకం ద్వారా జాతీయ స్థాయి బోర్డులో ప్రాతినిధ్యం లభించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ సినీ పరిశ్రమలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

Advertisement

ఈ నూతన బోర్డులో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు స్థానం లభించింది. నటులు సునీల్ శెట్టి, ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, మనోజ్ జోషి, పల్లవి జోషి, రూపాలీ గంగూలీలతో పాటు బెంగాలీ నటుడు ప్రోసేన్‌జిత్ ఛటర్జీ ఈ ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు రికీ కేజ్ కూడా ఈ బోర్డులో స్థానం పొందారు.

సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 లోని సెక్షన్ 3(1), సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్ 2024 లోని రూల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త బోర్డును పునర్వ్యవస్థీకరించింది. ప్రజల ప్రదర్శన కోసం ఉద్దేశించిన చిత్రాలను పరిశీలించి, తగిన సర్టిఫికేట్లను జారీ చేయడం ఈ బోర్డు యొక్క ప్రధాన విధి. ఈ నూతన బోర్డులో వినోద్ అనుపమ్, అభిషేక్ జైన్, హన్స్‌రాజ్ హన్స్, యతీంద్ర మిశ్రా, నీలా మాధబ్ పాండా, నిశిగంధ వాడ్, వామన్ కేంద్రే, రమేష్ పతంగే కూడా సభ్యులుగా వ్యవహరించనున్నారు.

Advertisement