హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసుకు సంబంధించి అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. వారిద్దరి రిమాండ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని వారిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తూ, ఆ రోజు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆజ్ఞాపించింది. కోర్టు ఆదేశాల మేరకు అవసరమైన ష్యూరిటీలు సమర్పించడంతో పోలీసులు వారిని విడుదల చేశారు.
కాగా, సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజు నల్ల దుస్తులతో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ గేటు బయట పోలీసులకు, బీఆర్‌ఎస్ సభ్యులకు మధ్య జరిగిన తోపులాట సమయంలో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి పోలీసులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌ను తిరస్కరించింది.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.