మన పత్రిక, తెలంగాణ: పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నిండింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
తొర్రూరు గ్రామానికి చెందిన బచ్చిగళ్ల శంకరయ్య, అనిత దంపతుల కుమారుడు అభిలాష్ (16) ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన అభిలాష్.. గ్రామ సమీపంలోని మంగళగుంట చెరువులో ఈతకు దిగాడు. లోతు అంచనా వేయలేక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు గ్రామంలోని సువర్ణ అనే మహిళకు సమాచారం అందించగా, ఆమె వెంటనే అభిలాష్ తండ్రికి ఫోన్ చేసి విషయం తెలిపారు. సమాచారం అందుకున్న తండ్రి శంకరయ్య హుటాహుటిన చెరువు వద్దకు చేరుకుని అభిలాష్‌ను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నేడు పదో తరగతి పరీక్ష ఉండగా.. ఇంతలోనే కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
