Advertisement

నీట్ అక్రమాలపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

మన పత్రిక: నీట్ (NEET) పరీక్షా అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై, పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకమైన విద్యా వ్యవస్థను కోరుకుంటున్న విద్యార్థులపై దమనకాండకు పాల్పడటం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.

152 ప్రశ్నాపత్రాల లీకేజీపై ఆందోళన

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా 152 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దీనివల్ల 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహణ కోసం రూ.1.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన బాధ్యతలను నిర్వహించడంలో విఫలమయ్యారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement