Advertisement

POLITICS: సెషన్ మొత్తానికి BRS సభ్యుల సస్పెన్షన్

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మూడో రోజూ తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి అంశాలపై చర్చించాలని కోరుతూ భారాస సమర్పించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలో రగడ మొదలైంది. BRS సభ్యులు ‘వి వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారి తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడుతూ.. “దేనికి జస్టిస్ కావాలి? మీ హయాంలో అన్యాయానికి గురైన దళితులకా?” అని ప్రశ్నించారు.

సభా కార్యక్రమాలకు పదేపదే అడ్డుపడుతున్నారనే కారణంతో కేటీఆర్, హరీశ్‌రావు సహా BRS ఎమ్మెల్యేలందరినీ ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ నిర్ణయానికి నిరసనగా శాసనమండలి నుంచి BRS ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. కాగా, సోమవారం నాటి ఘటనలకు సంబంధించి నిన్న ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలు ఇప్పటికే మండలి నుంచి సస్పెండైన సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement