Advertisement

క్యాన్సర్‌కు కారణమవుతున్న పురుగుమందులు: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

రాష్ట్రంలో కూరగాయల సాగు తీవ్రంగా తగ్గిపోవడం పట్ల పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు గ్రామాల్లో కూరగాయలు, సన్‌ఫ్లవర్‌, కందులు, పెసర పంటలు కనిపించేవని, కానీ ఇప్పుడు ఎటు చూసినా వరి సాగే కనిపిస్తోందని తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించిన ఆమె, కూరగాయల రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలని కోరారు.

పెస్టిసైడ్స్ వాడకం రోజురోజుకూ పెరగడం వల్లే క్యాన్సర్ కేసుల సంఖ్య ఎక్కువవుతోందని, వీటి వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించారు. మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలతో పాటు పాలల్లోనూ కల్తీ జరుగుతోందని, విజయ డైరీని అభివృద్ధి చేసి కల్తీ లేని పాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. కోతుల బెడద వల్ల కూడా రైతులు కూరగాయల సాగు వైపు రావడం లేదన్నారు. ఇక కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాత్‌నగర్‌ వద్ద కూరగాయల సాగు ఎక్కువని, అక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని రామచంద్రరావు మంత్రి తుమ్మలను కోరారు.

Advertisement
Advertisement