Advertisement

హైదరాబాద్: శాసనసభలో కోరం కరవు

TG: శాసనసభ సమావేశాలను అధికార కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం అసెంబ్లీ సాగిన తీరే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభలో మంత్రులు గానీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గానీ కనీస సంఖ్యలో కూడా కనిపించలేదు. బిఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్‌తో ఆ వైపు సీట్లన్నీ ఖాళీగా ఉండగా, అధికార పక్షం హాజరు కూడా నామమాత్రంగానే ఉండటంతో సభ వెలవెలబోయింది.

సభ ప్రారంభమైన గంటకే మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లిపోవడంతో, సొంత పనుల నిమిత్తం ఎమ్మెల్యేలు కూడా లాబీలకే పరిమితమయ్యారు. దీంతో బీజేపీ, ఎంఐఎం సభ్యులను కలిపినా సభ నడవడానికి కావలసిన 10 శాతం కోరం కూడా దక్కని పరిస్థితి నెలకొంది. కేవలం తమ శాఖల ప్రశ్నలకు సమాధానమిచ్చి మంత్రులు నిష్క్రమించడంతో సభ సీరియస్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఆలస్యంగా రావడమే సభ్యుల హాజరు తగ్గడానికి కారణమని ప్రచారం సాగుతోంది.

Advertisement
Advertisement