Advertisement

హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

మన పత్రిక: హైదరాబాద్ నగరాభివృద్ధిని చూస్తే తనకు అసూయ కలుగుతోందని ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు.

అమరావతి నిర్మాణానికి పట్టుదల

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను కట్టుబట్టలతో బయటకు పంపారని లోకేష్ ఆరోపించారు. ఆ సమయంలో ఎదురైన అవమానకర పరిస్థితులే తమలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలనే పట్టుదలను, కసిని పెంచాయని ఆయన వివరించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని విమర్శించిన లోకేష్, ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందేలా రాజధానిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

Advertisement

ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా అమరావతి

రాబోయే మూడు సంవత్సరాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలోకి ఇప్పటికే భారీ పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మించిన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ ప్రకటించారు.

Advertisement