Advertisement

నల్లబండగూడెంలో ఉపాధి హామీ పనుల్లో కుప్పకూలి కూలీ మృతి

మన పత్రిక, కోదాడ: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన వేముల పుల్లమ్మ (56) అనే మహిళా కూలీ శుక్రవారం పని స్థలంలోనే ఆకస్మికంగా మృతి చెందింది. రోజువారీ మాదిరిగానే ఉదయం కరువు పనికి వెళ్లిన ఆమె, తోటి వారితో కలిసి పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఉపాధి హామీ కూలీ మృతి చెందిన విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోదాడ ఎంపీడీఓ ఇసాక హుస్సేన్, ఎంపీఓ, ఇతర ఉపాధి హామీ సిబ్బందితో కలిసి పని ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించారు. అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. పుల్లమ్మ మృతి చెందిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంపీడీఓ వెల్లడించారు. తోటి కూలీ మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, తోటి కూలీలు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు అక్కడున్న వారికి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement