Advertisement

ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి, నలుగురు భారతీయుల మృతి

మన పత్రిక: ఉక్రెయిన్‌లోని ఒడెసా రేవు నుంచి జూలై 19 సాయంత్రం బయలుదేరిన ‘ఎమ్‌వీ గోల్డెన్ లియో’ (MV Golden Leo) అనే వాణిజ్య కార్గో నౌకపై జరిగిన భీకర దాడిలో నలుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొక భారతీయుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. దాడి జరిగిన సమయంలో ఈ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, అందులో ఐదుగురు భారతీయ జాతీయులు ఉన్నారు.

విదేశాంగ శాఖ తీవ్ర ఖండన

ఈ దారుణ ఉదంతంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ దాడిని అత్యంత తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం, సముద్రయాన స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం విచారకరమని భారత్ పేర్కొంది. మరణించిన భారతీయుల కుటుంబాలకు విదేశాంగ శాఖ సానుభూతి తెలిపింది.

Advertisement

బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తూ, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగ శాఖ వెల్లడించింది.

Advertisement