Advertisement

దానయ్య కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించిన మంత్రి పార్థసారథి

మన పత్రిక: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నడిపిన బైక్ ఢీకొని మృతి చెందిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసిన మంత్రి, వారికి ధైర్యం చెప్పి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గొర్రెల కాపరి సంఘం తరఫున రూ. 3 లక్షలు, తన తండ్రి జ్ఞాపకార్థం ఉన్న ‘కేపీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా మరో రూ. 2 లక్షలు కలిపి ఈ సాయాన్ని కుటుంబ సభ్యులకు స్వయంగా అందించారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండ

బాధిత కుటుంబ సభ్యుల పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి పార్థసారథి, దానయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, బాధ్యులు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement