Advertisement

మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, అధ్యాపకుల వేధింపులే కారణమని ఆరోపణ

మన పత్రిక: మణికొండలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన శ్రేయ అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇబ్రహీంబాగ్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న శ్రేయ, గత కొంతకాలంగా అధ్యాపకుల వేధింపులను భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు పొరపాటున సెల్‌ఫోన్‌ను ఎగ్జామ్ హాల్‌లోకి తీసుకెళ్లినందుకు ఆమెను పరీక్షల నుంచి డీబార్ చేశారు. ఆ ఘటన తర్వాత కాలేజీ సిబ్బంది ఆమెను నిత్యం లక్ష్యంగా చేసుకుని వేధించారని కుటుంబీకులు చెబుతున్నారు.

నిరంతర అవమానాలతో మనోవేదన

గత మూడు నెలలుగా అధ్యాపకులు తనను క్లాస్‌లో అందరి ముందూ అవమానిస్తూ, సూటిపోటి మాటలతో వేధించారని శ్రేయ తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. తన చావు వార్త కాలేజీ వారికి తెలియనివ్వవద్దని, తన మరణాన్ని చూసి వారు సంతోషిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేయ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రేయ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement