Advertisement

నేటి నుంచే ఐపీఎల్.. తొలి పోరులో బెంగళూరు vs హైదరాబాద్‌!

ఐపీఎల్‌ 19వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. పది జట్లు మరోసారి అసలైన టీ20 మజాను అందించేందుకు పోటీపడుతున్నాయి. శనివారం బెంగళూరు-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. గతేడాది టైటిల్‌ గెలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ట్రోఫీని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఒకసారి ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో కప్పుపై దృష్టి సారించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు తమ ఆధిపత్యాన్ని మళ్లీ చాటుకోవాలని చూస్తున్నాయి.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గత సీజన్‌ నిరాశను మరచి నాలుగో టైటిల్‌పై కన్నేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ కొత్త కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ నాయకత్వంలో పుంజుకోవాలని భావిస్తోంది. పంజాబ్‌ జట్టు శ్రేయస్‌ అయ్యర్‌పై ఆశలు పెట్టుకోగా, దిల్లీ, లఖ్‌నవూ జట్లు కూడా తొలి టైటిల్‌ కోసం పోటీపడుతున్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌ శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో మరోసారి బలంగా కనిపిస్తోంది.ఇక బెంగళూరు జట్టుకు ఈసారి కప్‌ను నిలబెట్టుకోవడం సవాల్‌గా మారింది. విరాట్‌ కోహ్లిపై మళ్లీ భారీ అంచనాలే ఉన్నాయి. గత సీజన్‌లో అతడు 657 పరుగులతో రాణించగా, కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ ఫామ్‌ కూడా కీలకం. ఫిల్‌ సాల్ట్‌, టిమ్‌ డేవిడ్‌, రొమారియో షెపర్డ్‌ వంటి విదేశీ ఆటగాళ్లు జట్టుకు బలం. భువనేశ్వర్‌ కుమార్‌ అనుభవం బౌలింగ్‌లో కీలకం కానుంది.

Advertisement

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా బలమైన బ్యాటింగ్‌తో భీకరంగా కనిపిస్తోంది. అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి హిట్టర్లు భారీ స్కోర్లపై దృష్టి పెట్టారు. అయితే బౌలింగ్‌లో కొంత బలహీనత కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఎలా ఆడతాయో ఆసక్తి నెలకొంది.

Advertisement