మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంపై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా (మార్చి 31) రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని, త్వరలోనే గృహప్రవేశాల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
శనివారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి నివేదిక’లో భాగంగా.. 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సమీక్షలోని ముఖ్యాంశాలు:
- రెండో విడత షెడ్యూల్: ఏప్రిల్ నెలలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుంది. అప్పటిలోగా మొదటి దశ ఇళ్ల పనులన్నీ ఓ కొలిక్కి రావాలని అధికారులను ఆదేశించారు.
- యుద్ధప్రాతిపదికన గ్రౌండింగ్: రాష్ట్రంలో ఇప్పటికే 3.60 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, కేవలం 20 శాతం ఇళ్లకే గ్రౌండింగ్ పనులు పూర్తయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో మార్చి 31లోపు మిగతా ఇళ్ల గ్రౌండింగ్ కూడా పూర్తి చేయాలి.
- పెండింగ్ బిల్లుల చెల్లింపు: వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు తక్షణమే మిగతా బిల్లులు చెల్లించాలి. నిర్మాణానికి దగ్గరగా ఉన్న ఇళ్లను జూన్ చివరి నాటికి పూర్తి చేయాలి. ఇసుక, సిమెంట్ ధరల భారం పడకుండా ‘ధరల నియంత్రణ కమిటీలు’ చురుగ్గా పనిచేయాలి.
- డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను సైతం మార్చి 31లోపు పూర్తి చేయాలి. ఇందులో సొంత స్థలం లేని నిరుపేదలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
- పెండింగ్ రిజిస్ట్రేషన్లు: హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్లను వెంటనే పూర్తి చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి నూతన ‘హౌసింగ్ రిజిస్ట్రేషన్ పోర్టల్’ను ప్రారంభించడంతో పాటు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
