Advertisement

హైదరాబాద్ మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య

మన పత్రిక, మాదాపూర్: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువకుడి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన చిన్నపల్లి భాస్కర్ గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. గతంలో తన స్వగ్రామానికి చెందిన నిఖిత అనే యువతిని ప్రేమించగా, కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో మూడేళ్ల క్రితం ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే భర్తతో విభేదాల కారణంగా ఆమె విడాకులు తీసుకుంది.

విడాకుల కక్షతోనే ఘాతుకం

తన కూతురి విడాకులకు భాస్కరే కారణమని నిఖిత తండ్రి రాజు భావించాడు. ఈ విషయంలో గతంలోనే భాస్కర్‌ను చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పగతోనే ప్లాన్ వేసిన నిందితులు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయ్యప్ప సొసైటీలోని భాస్కర్ ఉంటున్న హాస్టల్ వద్దకు వెళ్లి, కత్తులతో దాడి చేసి అతడిని కిరాతకంగా హత్య చేశారు.

Advertisement

పోలీసుల దర్యాప్తు

మృతుడి సోదరుడు మధు ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజు, కుమారస్వామి, నాగరాజు, రాహుల్‌తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా ఆ యువతి భాస్కర్‌కు మెసేజ్‌లు చేసేదని, అనవసరంగా కక్ష కట్టి తన తమ్ముడిని పొట్టనబెట్టుకున్నారని మృతుడి సోదరుడు మధు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement