Advertisement

హనీమూన్ హత్య కేసులో భార్య బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

మన పత్రిక: మేఘాలయలో చోటుచేసుకున్న Honeymoon Murder Case లో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2025 మే నెలలో జరిగిన తన భర్త రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెకు గతంలో షిల్లాంగ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్‌ను రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం, మూడు వారాల వ్యవధిలో సంబంధిత అధికారుల ముందు లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది.

గతంలో అరెస్ట్ మెమోలో సెక్షన్ల నమోదులో పొరపాట్లు జరగడం, అరెస్టుకు గల కారణాలను సరిగ్గా వివరించలేదనే సాంకేతిక అంశాల ఆధారంగా ఆమెకు బెయిల్ లభించింది. దర్యాప్తు సంస్థలు చేసిన పొరపాట్ల వల్ల నిందితులకు శాశ్వత రక్షణ లభించదని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలెలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మేఘాలయ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ ప్రారంభమై అభియోగాలు కూడా నమోదైనందున, నిందితురాలు బెయిల్‌పై బయట ఉండటం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.

Advertisement

ఈ కేసు విచారణ సందర్భంలో నేటి సమాజంలో మారుతున్న మానవ సంబంధాలు, యువత తీరుపై న్యాయమూర్తులు స్పందించారు. ప్రస్తుత తరంలో ఓపిక తగ్గిందని, చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతున్నారని జస్టిస్ సుందరేశ్ పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించడం, భౌతికవాదం పెరిగిపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement