మన పత్రిక, న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ఎటువంటి అనిశ్చితి నెలకొన్నా, దేశీయ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలోని ప్రతి పౌరుడికి రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దీనికి అదనంగా, తదుపరి రెండు నెలల అవసరాలను తీర్చేందుకు వీలుగా ముడి చమురు (Crude Oil) దేశానికి చేరుకుంటోందని పేర్కొంది.
వంటగ్యాస్‌కు డోకా లేదు మరోవైపు ఎల్‌పీజీ సరఫరాపై వస్తున్న వదంతులను ప్రభుత్వం కొట్టిపారేసింది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి సుమారు 8,00,000 టన్నుల ఎల్‌పీజీ దిగుమతి అవుతోందని సమాచారం ఇచ్చింది. వచ్చే నెల రోజుల వరకు వంటగ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, ప్రజలు నిశ్చింతగా ఉండవచ్చని కేంద్రం భరోసా ఇచ్చింది. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని, ఇంధన లభ్యత విషయంలో ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని ప్రభుత్వం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
