Advertisement

లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: భారీ గ్యాప్ అప్‌తో ప్రారంభమయ్యే అవకాశం

మన పత్రిక: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో కనిపించిన లాభాల బాటతో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాప్ అప్‌తో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశ తీర్మానాలు వెలువడనున్న నేపథ్యంలో విదేశీ మార్కెట్ల సంకేతాలు సానుకూలంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.

గత సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు గణనీయమైన లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్ 2.59 శాతం, ఎస్ అండ్ పీ 1.79 శాతం మేర పుంజుకోగా, డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.34 శాతం లాభంతో కొనసాగింది. ఐరోపా మార్కెట్లలోనూ ఇదే రకమైన లాభాల పరంపర నమోదైంది. యూకేకి చెందిన ఎఫ్టీఎస్ఈ 0.20 శాతం, ఫ్రాన్స్ సీఏసీ 0.61 శాతం, జర్మనీ డీఏఎక్స్ 0.77 శాతం మేర పెరిగాయి.

Advertisement

ఆసియా మార్కెట్లలో కూడా మెజారిటీ సూచీలు సానుకూలంగా స్పందించాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.10 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.34 శాతం, జపాన్ నిక్కీ 3.16 శాతం, చైనా షాంఘై 0.74 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 0.21 శాతం చొప్పున లాభాల్లో కదలాడాయి. కాగా, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ మాత్రం 0.41 శాతం నష్టాన్ని నమోదు చేసింది. గిఫ్ట్ నిఫ్టీ 0.67 శాతం నష్టంతో కనిపించినప్పటికీ, మన మార్కెట్లలో లాభాల ప్రారంభానికే అవకాశాలు ఉన్నట్లు ట్రేడింగ్ వర్గాలు భావిస్తున్నాయి.

కీలక అంశాలు, విదేశీ పెట్టుబడులు

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎఫ్ఐఐఎస్ (FIIs) వరసగా ఆరో సెషన్‌లోనూ కొనుగోళ్లు కొనసాగించారు. గత సెషన్‌లో రూ. 2,446 కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా కొనుగోలు చేశారు. అదే సమయంలో స్వదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు డీఐఐఎస్ (DIIs) రూ. 936 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

మిగిలిన ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు తగ్గి 95.38 వద్ద నిలిచింది. డాలర్ ఇండెక్స్ 99.88 వద్ద, 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.61 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.40 నుండి 0.99 కు పడిపోగా, విక్స్ వీఐఎక్స్ (VIX) 2.22 శాతం పెరిగి 12.19 కి చేరింది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 79.05 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Advertisement