Advertisement

రూ.64 కోట్ల సైబర్ మోసానికి పాల్పడిన ఇంటర్ డ్రాపౌట్ అరెస్ట్

మన పత్రిక, సూరత్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ దేశవ్యాప్తంగా రూ.64.38 కోట్ల సైబర్ ఫ్రాడ్ కు పాల్పడిన 18 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌కు చెందిన రోహిత్ వీరేంద్ర సింగ్ శాక్య అనే ఇంటర్ డ్రాపౌట్ విద్యార్థిని సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి ల్యాప్‌టాప్ మరియు పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

నకిలీ యాప్‌ల తయారీలో మాస్టర్ మైండ్

ఈ ఏడాది మే నెలలో సూరత్‌కు చెందిన ఒక వ్యక్తిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB One) యాప్ పేరుతో వచ్చిన నకిలీ ఏపీకే ఫైల్ ద్వారా రూ.5 లక్షలు మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోహిత్ పాత్రను గుర్తించారు. 16 ఏళ్ల వయస్సు నుంచే కోడింగ్ నేర్చుకున్న రోహిత్, బాధితుల ఫోన్లలోని బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలను రియల్ టైమ్‍లో చూసేలా అడ్మిన్ అప్లికేషన్లను అభివృద్ధి చేశాడు. ఈ నకిలీ యాప్‌లను సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ ముఠాలకు నెలకు రూ.15 వేల చొప్పున విక్రయించేవాడని పోలీసులు తెలిపారు.

Advertisement

ముఠాల కోసం ప్రత్యేక అప్లికేషన్లు

రోహిత్ తన క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, యూకో బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బిగ్‌బాస్కెట్ మరియు ఆర్టీవో చలాన్ సేవలకు సంబంధించిన నకిలీ యాప్‌లను తయారు చేసేవాడని దర్యాప్తులో వెల్లడైంది. జమ్‌తారా, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన పలు సైబర్ నేరస్థుల ముఠాలు ఇతని వద్ద నుంచే ఈ వైరస్ ఉన్న యాప్‌లను కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement