Advertisement

గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

TG: రాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉత్సవాల నిర్వహణ, బందోబస్తు, మౌలిక వసతుల కల్పనపై శుక్రవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులతో నేరుగా సమీక్షించే సంప్రదాయాన్ని పునర్దుద్ధరించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, నిర్వాహకులు దరఖాస్తు చేసుకుని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మండపాల ఏర్పాటు సమాచారాన్ని స్థానిక కమీషనరేట్లకు ఇవ్వడం ద్వారా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించగలరని చెప్పారు.

Advertisement

నిమజ్జనం కోసం చెరువుల చుట్టూ క్రేన్ల ఏర్పాటుకు నిర్మాణ దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Advertisement