Advertisement

BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు

TG POLITICS: తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల రెండోరోజు తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన BRS ఎమ్మెల్సీ తాతా మధు, పోలీసులపై దౌర్జన్యానికి దిగిన ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిల వైఖరిని సభ తీవ్రంగా తప్పుపట్టింది. వారిపై చర్యలు తీసుకోవాలని శాసనసభ తీర్మానం చేసి మండలి ఛైర్మన్‌కు పంపడంతో, ఈ సెషన్ ముగిసే వరకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.

సోమవారం నాటి ఘటనలపై నమోదైన కేసుల్లో మంగళవారం ఉదయమే పోలీసుల చేతిలో అరెస్టయిన ఇద్దరు ఎమ్మెల్సీలను రిమాండ్ చేయడానికి కోర్టు తిరస్కరించడంతో వారు పూచీకత్తుపై విడుదలయ్యారు. అనంతరం సభ ప్రారంభం కాగానే BRS సభ్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపగా, స్పీకర్-హరీశ్‌రావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభ వాయిదా పడింది. మధ్యాహ్నం సభ పునఃప్రారంభమయ్యాక, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు ఇద్దరు ఎమ్మెల్సీల ప్రవర్తనను ఖండించారు. విప్ ఆది శ్రీనివాస్ ఫొటోల ఆధారంగా వారి ప్రవర్తనను ఎండగట్టారు.

Advertisement

స్పీకర్‌పై వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ దళిత సంఘాలు కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి యత్నించడంతో ఎర్రవెల్లి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల ఘర్షణ, లాఠీఛార్జీలో గజ్వేల్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి నరసారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అక్కడకు బయలుదేరిన కేటీఆర్, హరీశ్‌రావులను హకీంపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిణామాలపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో సమీక్ష జరిపి, స్పీకర్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Advertisement