హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ నిరసిస్తూ శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర పోషించగా, ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్గా వ్యవహరించారు.
సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తలసాని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా సస్పెన్షన్లపై చురకలంటిస్తూ.. “కొండా సురేఖ బిడ్డ నా గురించి మాట్లాడింది కాబట్టే ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు ఉండి తొక్కి వచ్చాను. ముఖ్యమంత్రినైన నన్ను, అదీ ఓ బీసీ బిడ్డను బర్తరఫ్ చేయక ఏం చేయాలి?” అంటూ సెటైర్లు వేశారు. కేబినెట్లో వేరే వాళ్లు కూడా ఉన్నారని, కొండా సురేఖ బిడ్డ వాళ్ల గురించి కూడా మాట్లాడొచ్చుగా అని వ్యాఖ్యానించారు.
అనంతరం బీఆర్ఎస్ మహిళా నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “సబితక్క, సునీతక్క అంటే నాకు ఎంతో గౌరవం. కానీ, మీరు ఇవన్నీ సభలో ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశాను” అంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తకుండా ప్రతిపక్షాలపై సస్పెన్షన్ వేటు వేస్తూ మంత్రులు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. సభను ఏకపక్షంగా నడిపిస్తూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను భయపెట్టలేరని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.