Advertisement

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. సభా కార్యక్రమాలకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. దాదాపు 22 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఈ వర్షాకాల సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ బుధవారం ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, నినాదాలతో సభను స్తంభింపజేసే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ గందరగోళం కొనసాగింది. దీంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రతిపాదించిన సస్పెన్షన్ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహా 22 మంది సభ్యులను సెషన్ అంతటికి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ వెల్లడించారు.

మరోవైపు నిషేధిత భూముల జాబితా (22A) అంశంపై అసెంబ్లీలో తక్షణమే చర్చ చేపట్టాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని, 22Aపై చర్చకు ముందుకు రాకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ శాసనసభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ ప్రాంగణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Advertisement
Advertisement