మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ కల్లు, గల్ఫ్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వ పథకాల పేర్లు, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర తెలంగాణలో ఆల్ఫ్రాజోలం (Alprazolam) కల్తీ కల్లు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ లేని తెలంగాణను నిర్మించాలని డిమాండ్ చేస్తూనే.. మద్యం బ్రాండ్లలాగే ఇప్పసారాకు కూడా ‘పింక్ లేబుల్’ వంటి పేర్లు పెట్టి ప్రభుత్వమే సరఫరా చేయాలని ఎద్దేవా చేశారు.
ప్రతి ప్రభుత్వ పథకానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు పెట్టడం ద్వారా ఆమెను అవమానించవద్దని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ప్రభుత్వ పథకాలకు పెట్టేందుకు తెలంగాణ అమరవీరుల పేర్లు దొరకడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీఎం అయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు సేవ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి సీనియర్లను అవమానించి బయటకు పంపుతున్నారని, నిన్న ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చనిపోయిన 120 మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఇప్పటివరకు పరిహారం అందలేదని, వారు సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. గల్ఫ్ సంక్షేమ నిధికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
