మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారుల్లో భయాందోళనలు పెరిగి బంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీనివల్ల నగరంలోని ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఆఫీసులు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే, పెట్రోల్ కొరత వార్తలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో మూడు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో డిమాండ్ 17,246 కిలోలీటర్లు ఉండగా, 17,898 కిలోలీటర్లు సరఫరా చేశామని, అదనంగా 16,000 కిలోలీటర్ల నిల్వ కూడా అందుబాటులో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్లే ఒక్కసారిగా డిమాండ్ 25 శాతం పెరిగిందని, దీనివల్ల కొన్ని బంకులకు ట్యాంకర్లు సకాలంలో చేరుకోలేక ‘నో స్టాక్’ బోర్డులు పెట్టాల్సి వచ్చిందని మంత్రి ఉత్తమ్ వివరించారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ కంపెనీలు నిబంధనలు మార్చడమే ఈ సంక్షోభానికి అసలు కారణమని బంకు యజమానులు అంతర్గతంగా చెబుతున్నారు. గతంలో ట్యాంకర్లు తీసుకున్నాక డబ్బులు చెల్లించే వెసులుబాటు ఉండేదని, ఇప్పుడు ముందుగానే మొత్తం డబ్బు చెల్లిస్తేనే ట్యాంకర్లు బుక్ చేసుకునేలా ఆప్షన్ మార్చారని డీలర్లు వాపోతున్నారు. పాత బకాయిలు కూడా ఇప్పుడే కట్టాలని ఒత్తిడి చేయడంతో వారు ట్యాంకర్లు బుక్ చేసుకోవడం లేదని, తద్వారా కృత్రిమ కొరత ఏర్పడిందని సమాచారం.
ఈ వ్యవహారంపై కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఇంధన నిల్వల కొరత లేదని, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
