మన పత్రిక, తెలంగాణ: అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన బాసర క్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రూ.225 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భూమిపూజ చేయనున్నారు. దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది తీరాన వెలసిన ఈ క్షేత్రం అక్షరాభ్యాసాలకు కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి వంటి పర్వదినాల్లో వేలాదిమంది చిన్నారులు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు. అయితే భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, తగిన సౌకర్యాల లేమి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆలయ అభివృద్ధి పనులు సంప్రదాయాలకు అనుగుణంగా జరగేలా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం శృంగేరి పీఠం పీఠాధిపతుల సూచనలు తీసుకున్నారు. గర్భగుడి, అర్ధ మండపం, రాజగోపురం, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారం వంటి నిర్మాణాలకు అనుమతులు పొందారు. ప్రస్తుతం సుమారు 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు విస్తరించనున్నారు. ఉత్తర దిశలో 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు నిర్మించనున్నారు. నాలుగు వైపులా 33 అడుగుల వెడల్పుతో మాడ వీధులు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచనున్నారు. ఆలయంలోని నిర్మాణాలన్నీ శిలలతో నిర్మించనున్నారు.భక్తుల కోసం ఆలయ ప్రాంగణం బయట హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆలయం వెనుక భాగంలో విస్తృతంగా వృక్షాలు నాటే ప్రణాళిక కూడా ఉంది. రాబోయే సంవత్సరంలో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని లక్షలాది భక్తులకు అవసరమైన వసతులు కల్పించేలా పనులు చేపట్టనున్నారు.
బాసర క్షేత్రానికి గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉంది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం వేదవ్యాస మహర్షి ప్రశాంతత కోసం గోదావరి తీరానికి వచ్చి ఇక్కడ నివసించారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లను ప్రతిష్ఠించారని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం ముగ్గురమ్మల ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన మనుమడికి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించనున్నారు. అనంతరం ఇచ్చోడకు వెళ్లి రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే బోథ్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. తరువాత పిప్రి గ్రామంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
