మన పత్రిక, తెలంగాణ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్‌చల్ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు అనుముల రేవంత్ రెడ్డి ఫోటోతో క్యాంప్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లి, అక్కడ సీఎం ఫోటోను ఏర్పాటు చేశారు. అనంతరం కార్యాలయంలోనే జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామాల మధ్య క్యాంప్ కార్యాలయంపై దుండగులు దాడి జరిపారు. ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ దాడికి కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని బీఆర్ఎస్ ఆరోపించగా, తాము కేవలం సీఎం ఫోటోను మాత్రమే పెట్టామని, దాడిలో తమ పాత్ర లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ ఘటనతో గజ్వేల్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ, ఇది పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగినదేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై దాడిగా ఈ ఘటనను అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు నిత్యకృత్యంగా మారాయని విమర్శించిన హరీశ్ రావు, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు తటస్థంగా వ్యవహరించాలన్నారు. ఒకవైపు “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రతిపక్షాల స్వరాన్ని అణిచివేస్తూ, మరోవైపు దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం గజ్వేల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
