మన పత్రిక, TG: క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. గతంలో అల్లర్లు, గొడవల కారణంగా వాయిదా పడిన నేపథ్యంలో ఈసారి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. క్యాతన్‌పల్లి సమావేశ మందిరంలో కౌన్సిలర్ల మధ్య గొడవలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వేర్వేరు పార్టీలకు చెందిన సభ్యులు విడివిడిగా కూర్చునేలా ఇనుప రెయిలింగ్‌లు ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. వాహనాల పార్కింగ్‌కు కూడా ప్రత్యేక స్థలాన్ని గుర్తించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఎన్నికల సమయంలో నలుగురికిపైగా గుంపులుగా చేరడం, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం నిషేధమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సమావేశ మందిరంలోకి మీడియా ప్రవేశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన ఘటనలపై స్పష్టత లేకపోవడం, అధికారిక రికార్డులు వెలువడకపోవడం వల్ల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక ఖానాపూర్ మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య పోటీ తీవ్రంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ సాధన కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. కౌన్సిలర్ల మద్దతు కోసం క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్కు చెందిన 5వ వార్డు కౌన్సిలర్ పోసవ్వ కిడ్నాప్ అయ్యారనే ఆరోపణలు ఉద్రిక్తతను పెంచాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండిస్తూ ఇది కేవలం రాజకీయ నాటకమని పేర్కొన్నారు.
గతంలో కోరం లేక వాయిదా పడిన ఎన్నికల నేపథ్యంలో ఈసారి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. క్యాంపు రాజకీయాలు, కిడ్నాప్ ఆరోపణలు, పరస్పర విమర్శల మధ్య ఈ ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఎవరు మున్సిపల్ పీఠాన్ని అధిరోహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
