మన పత్రిక, తెలంగాణ, క్రైం: నారాయణపేట జిల్లాలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య కలకలం రేపింది. నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తేజశ్రీ (5) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిన్నారి మృతదేహం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై లభ్యమవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. తేజశ్రీ తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లగా, చిన్నారిని తాతమ్మల వద్ద ఉంచారు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు చెరువు కట్టపై చిన్నారి మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తర్వాత పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు పంపించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక కాళ్లలోని వెండి కడియాలను మాత్రమే తీసి, చెవిపోగులు అలాగే వదిలేయడం అనుమానాస్పదంగా మారింది. అదే సమయంలో పక్కనే నిద్రిస్తున్న నాన్నమ్మ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను ముట్టుకోకపోవడం గమనార్హం. దీంతో ఇది దొంగతనం కోసమో, సాధారణ ఘటనో కాదని పోలీసులు భావిస్తున్నారు. గ్రామంలో బలి ఇచ్చారనే పుకార్లు వినిపించినా, అలాంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారి హత్యతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
