మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా ముగించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
కీలక తేదీలు ఇవే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ పలు కీలక తేదీలను ప్రకటించింది.
- జనవరి 12, 2026: ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు చివరి తేదీ. ఇదే రోజున తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలి.
- జనవరి 13, 2026: అభ్యంతరాల పరిశీలన ప్రారంభం. అలాగే, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ‘టీ-పోల్’ (T-Poll) మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలి.
- జనవరి 16, 2026: పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాలను విడుదల చేయాలి.
జీహెచ్ఎంసీకి మినహాయింపు రాష్ట్రవ్యాప్తంగా పదవీకాలం ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని మూడు విభాగాలుగా చేయాలన్న ప్రతిపాదన ఉన్నందున, ప్రస్తుతానికి జీహెచ్ఎంసీని ఎన్నికల నుంచి మినహాయించారు. అలాగే పదవీకాలం ఇంకా ముగియని మరో 4 మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు ఉండవు.
కఠినంగా కోడ్ అమలు 2019 ఓటర్ల జాబితానే ప్రాథమిక జాబితాగా పరిగణిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ పెట్టెలు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
