మన పత్రిక, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నేడు (బుధవారం) సాయంత్రం తీర్పు చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో, వారిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, ఫిరాయింపుల వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 18వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం వెల్లడించాలని స్పీకర్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో డెడ్ లైన్ కు ఒక్క రోజు ముందే తీర్పు వెలువడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలి విడత విచారణ పూర్తయిన ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డిల భవితవ్యం నేడు తేలనుంది. ఇప్పటికే ఈ ఎమ్మెల్యేల న్యాయవాదులకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యేల న్యాయవాదులు, ఫిర్యాదుదారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి చేరుకోనున్నారు. స్పీకర్ ఛాంబర్ లో ఓపెన్ కోర్ట్ నిర్వహించి తీర్పును వెలువరిస్తారు. అనంతరం తీర్పు ప్రతులను అధికారికంగా అసెంబ్లీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇక మిగిలిన ఎమ్మెల్యేల విషయాన్ని పరిశీలిస్తే.. రెండో విడతలో కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలపై స్పీకర్ విచారణ చేపట్టారు. మరోవైపు సీనియర్ నేతలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు మాత్రం స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు. మొత్తానికి నేడు వెలువడనున్న ఐదుగురి తీర్పు.. వారి పదవులపై అనర్హత వేటు వేస్తుందా లేక మరేదైనా నిర్ణయం వెలువడుతుందా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
