Advertisement

వరంగల్: భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య

భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన గ్రేటర్‌ వరంగల్‌ నగరం 16వ డివిజన్‌ ధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసులు మరియు మృతురాలి బంధువుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రిసోల్ గ్రామానికి చెందిన గుప్తేశ్వర్‌ బిష్యాన్‌కు, తన మేనకోడలు మిల్లీ బిస్వాస్‌(21)తో ఈ ఏడాది జూన్‌ 14న పూరి జగన్నాథ దేవాలయంలో వివాహం జరిగింది.

పెళ్లయిన తర్వాత ఈ దంపతులు వరంగల్‌కు వచ్చి గీసుకొండ మండలం ధర్మారంలో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. అయితే కొద్ది రోజులుగా భర్త గుప్తేశ్వర్‌ అనుమానంతో తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేయసాగాడు. ఈనెల 8న మిల్లీ తన తల్లికి ఫోన్‌ చేసి భర్త తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, తనకు భార్య అవసరం లేదని ఇంటి నుంచి వెళ్లిపోవాలని లేదా చనిపోవాలని రోజూ అంటున్నాడని కన్నీరుమున్నీరైంది.

Advertisement

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ధర్మారానికి చేరుకుని చూడగా.. అప్పటికే భర్త వేధింపులు తలచుకుని మిల్లీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడు గుప్తేశ్వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్‌ తెలిపారు.

Advertisement