సీఎం నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమల ప్రాంతాలలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతికి చేరుకోనున్న సీఎం, ఆ తర్వాత తిరుమల కొండపైకి వెళ్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజల సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం హోదాలో ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం తిరుమలలో ప్రసిద్ధి చెందిన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు, పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.
సెప్టెంబర్ 16న తిరుమలలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. పర్యావరణ పరిరక్షణ, రవాణా సౌకర్యాల మెరుగుదలకు పెద్దపీట వేస్తూ గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద నూతన ఈవీ బస్సులను జాతికి అంకితం చేయనున్నారు. అలాగే ఆధ్యాత్మిక, నగర చరిత్ర విశేషాలను కళ్లకు కట్టేలా ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియంను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమాల అనంతరం తిరుమల పరిపాలనా భవనం, విశ్రాంతి గృహంలో టీటీడీ, జిల్లా పోలీసు, ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. భక్తుల వసతులు, భద్రత, టీటీడీ పాలనాంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేయనున్నారు. పర్యటన ముగిసిన తర్వాత ఎల్లుండి మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి విజయవాడ సమీపంలోని ఉండవల్లికి ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
