Advertisement

వివాహేతర సంబంధం.. కన్నకొడుకునే కడతేర్చిన తల్లి

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని మహరాజ్‌పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాన్ని చూడటంతో కన్నకొడుకునే తల్లి ప్రియుడితో కలిసి పొట్టనబెట్టుకుంది. విపౌసి గ్రామానికి చెందిన ఓ వివాహితకు 14 ఏళ్ల కుమారుడు సత్యం ఉన్నాడు. అయితే ఆమె స్థానికంగా ఉండే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 10వ తేదీ గురువారం రాత్రి గదిలో ప్రియుడితో ఆమె ఏకాంతంగా ఉండగా కొడుకు సత్యం కంటపడ్డాడు. దీంతో ఖంగుతిన్న అతను ఈ విషయాన్ని వెంటనే తన తండ్రికి చెబుతానని హెచ్చరించాడు.

తన బండారం బయటపడుతుందనే భయంతో ఆ తల్లి కన్నకొడుకు అని కూడా చూడకుండా రాక్షసంగా ప్రవర్తించింది. బాలుడి చేతులను తల్లి గట్టిగా పట్టుకోగా.. ప్రియుడు గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. ఈ హత్యను కప్పిపుచ్చేందుకు తీవ్రమైన కడుపు నొప్పితో కుమారుడు మృతి చెందినట్లు వారు నాటకం ఆడారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో బాలుడి శరీరంపై, మెడ భాగంలో గాయాలు ఉన్నట్లు తేలడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తల్లే తన ప్రియుడితో కలిసి సత్యంను హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Advertisement
Advertisement