Advertisement

ఘట్కేసర్: వినాయక విగ్రహం కొనుగోలులో ఘర్షణ.. యువకుడి మృతి

TG CRIME: పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల వివరాల ప్రకారం.. చౌదరిగూడకు చెందిన కొందరు యువకులు ఆదివారం అర్ధరాత్రి జోడిమెట్ల సమీపంలోని వినాయక విగ్రహాల షెడ్డుకు వెళ్లారు. అక్కడ విక్రేతలతో ధర విషయంలో వాగ్వాదం జరిగి, అది ఘర్షణకు దారితీసింది. విగ్రహాలు అమ్ముతున్న రాజస్థాన్‌కు చెందిన చోగారామ్‌ తలకు తీవ్రగాయం కావడంతో అతని కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో చౌదరిగూడకు చెందిన పసులాది కిరణ్‌ (34) అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

Advertisement

కిరణ్‌ మృతితో ఆగ్రహించిన చౌదరిగూడ వాసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement