Advertisement

ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జూన్ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇన్-సర్వీస్ టీచర్లు 51 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెగ్యులర్ అభ్యర్థులు 47 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను ప్రభుత్వం కేటాయించిన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, మరింత సులభంగా తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంచినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ మంత్రి లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఇన్-సర్వీస్ టీచర్లు చూపిన విద్యా ప్రతిభ, విధి నిర్వహణలోని నిబద్ధత ఎంతో అభినందనీయమని కొనియాడారు. బోధనా రంగంలో అర్హత సాధించిన కొత్త అభ్యర్థులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు రాబోయే రోజుల్లో రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా డిజిటల్ విధానాలను విస్తృతంగా వినియోగించి ఫలితాలు వెల్లడించినట్లు తెలిపారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి నియామక ప్రక్రియలకు సమాయత్తం కావాలని సూచిస్తూ, ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తు బంగారు బాటగా మారాలని ఆకాంక్షించారు.

Advertisement

Advertisement