TG: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు కాస్త శాంతంగా ఉన్న జనసేన పార్టీ ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. రాబోయే అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి వెల్లడించారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సాధిస్తున్న ఆదరణ తరహాలోనే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ బలమైన ప్రజాశక్తిగా ఎదిగారని ఆయన వ్యాఖ్యానించడం పొలిటికల్ హీట్ పెంచింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తర్వాత, తెలంగాణపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 10 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సమీక్షా సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసి కేడర్‌లో ఉత్సాహం నింపారు. త్వరలో జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అందరికంటే ముందే అభ్యర్థిని ఖరారు చేసింది. జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్, రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
కేవలం అభిమానుల బలంతోనే కాకుండా, పక్కా రాజకీయ వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోంది. 22A భూముల సమస్యలు, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి కీలక ప్రజా సమస్యలపై రోడ్డెక్కి పోరాడుతోంది. ఇటీవల చేపట్టిన అసెంబ్లీ ముట్టడి యత్నం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
తెలంగాణలో జనసేన పొత్తులు ఎవరితో ఉంటాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమితో కలిసి సాగుతున్నప్పటికీ, తెలంగాణ బీజేపీ నాయకత్వం మాత్రం పొత్తుల వార్తలను ఖండిస్తూ వస్తోంది. పొత్తులతో ముందుకెళ్తారా లేక పవన్ సైన్యం ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అనేది ఆయన తెలంగాణ పర్యటన తర్వాతే తేలనుంది.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.