Advertisement

అభిజిత్ దీప్కే కారును ముట్టడించిన ఇన్‌ఫ్లుయెన్సర్లు

మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు చేదు అనుభవం ఎదురైంది. అంతుచిక్కని వ్యాధుల బారిన పడి గిరిజన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన అడోరి, కోర్కా, బొందారి గ్రామాల్లో ఆయన పర్యటించారు. బాధితులను పరామర్శించి అక్కడి వైద్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అయితే ఆయన పర్యటన ముగించుకుని తిరుగుపయనమవుతున్న సమయంలో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు కారును చుట్టుముట్టి ఆందోళన చేశారు. ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ మైక్ పట్టుకుని “శవాల మీద రాజకీయాలు చేయడానికి వచ్చారా? ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చారు?” అని నిలదీసింది. దీప్కే ఆలస్యానికి క్షమాపణ చెప్పినా, “మంచి రోడ్లు వేశారు, కనిపించడం లేదా?” అంటూ ఆమె వాగ్వాదానికి దిగింది. వాతావరణం వేడెక్కడంతో సీజేపీ కార్యకర్తలు ఆయనను వేరే వాహనంలో తరలించారు. బయటి ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్లు వచ్చి నిరసన తెలపడంపై స్థానిక జర్నలిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement