Advertisement

గ్లోబల్ పోటీకి తగినట్లు నూతన విద్యా విధానం: సీఎం

హైదరాబాద్‌: భవిష్యత్‌ తరాల పునర్నిర్మాణం విద్యా వ్యవస్థతోనే సాధ్యమని, జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల భవిష్యత్తును తరగతి గదుల్లోనే తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. 2024 సీపెక్ సర్వే ప్రకారం చదువు లేకపోవడమే సామాజిక వెనుకబాటుతనానికి ప్రధాన కారణమని తేలిందన్నారు. ఎంత ఆస్తి ఉన్నా విద్యకు దూరమైతే వెనుకబడిపోతారని, అక్షరమే మానవ జీవితాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తుందన్నారు. ఎల్పీజీ సంస్కరణల అనంతరం విద్యావ్యవస్థలో తీవ్ర మార్పులు వచ్చాయని, అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా తెలంగాణ విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని తెలిపారు.

పండిత్ నెహ్రూ అడుగుజాడల్లో నడుస్తూ విద్యావ్యవస్థలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు ప్రత్యేక విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశామని, నూతన మార్గదర్శకాలకు కేశవరావు కమిటీని నియమించామన్నారు. రాష్ట్రంలో 28,163 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 28.77 లక్షల మంది విద్యార్థులుండగా, 1.57 లక్షల మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నారని వివరించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11,000 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చి, కేవలం 55 రోజుల్లోనే అవినీతికి తావులేకుండా 10,600 మందికి నియామక పత్రాలు అందించామన్నారు. రాబోయే రోజుల్లో విద్యా బడ్జెట్ కేటాయింపులు పెంచుతామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement