Advertisement

ఉరవకొండ శివారులో ఘోరం.. ముగ్గురు దుర్మరణం

AP CRIME: ఓ కేసు రాజీకి సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తిరుగు ప్రయాణమైన ముగ్గురు ప్రాణస్నేహితులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలిగొంది. అనంతపురం జిల్లా ఉరవకొండ శివారు గుంతకల్లు ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పోలీసుల వివరాల ప్రకారం.. వజ్రకరూరుకు చెందిన జైనుల్లా(44), మహబూబ్‌బాషా(33), మహమ్మద్‌రఫీ(29) ఆప్తమిత్రులు. వీరు ఓ గొడవకు సంబంధించి లోక్‌ అదాలత్‌లో రాజీ పడేందుకు ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పని ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వారిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనం అర కిలోమీటరు దూరంలో పడిపోయింది. ప్రమాద వార్త తెలిసిన బంధువులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సీఐ మహానంది, ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పరారైన వాహనం కోసం గాలింపు చేపట్టారు.

కుటుంబాల్లో తీరని శోకం: మృతుల్లో జైనుల్లా టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మహమ్మద్‌ రఫీ డ్రైవర్‌గా పనిచేస్తూ తన వృద్ధురాలైన తల్లికి ఆసరాగా ఉంటున్నారు. ఇక ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న మహబూబ్‌బాషా భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. పుట్టబోయే బిడ్డను చూడకుండానే ఆయన అనంతలోకాలకు వెళ్లడం పలువురిని కలచివేసింది.

Advertisement
Advertisement