CRIME: తార్నాక: ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఓ దంపతుల సంసారంలో మనస్పర్థలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. గురువారం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన శరణప్ప (28), లక్ష్మి (24) దంపతులకు 15 నెలల క్రితం వివాహమైంది. తార్నాక విజయపురి కాలనీలో శరణప్ప తల్లిదండ్రులతో కలసి నివసిస్తున్నారు. శరణప్ప నాచారంలోని ఒక హోటల్‌లో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా, ఇటీవల రాఖీ పండగకు సొంతూరుకు వెళ్లి వచ్చిన తర్వాత మనస్పర్థలు మరింత తీవ్రమయ్యాయి.
గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నిద్రలేచిన శరణప్పకు భార్య లక్ష్మి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమె మరణించిందనే భయంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండానే శరణప్ప ఇల్లు వదిలి బయటకు పరుగెత్తాడు. కొడుకు రోజూలాగే విధుల్లోకి వెళ్తున్నాడనుకుని, ఖర్చుల కోసం రూ.100 అడిగేందుకు తండ్రి ధర్మన్న అతడి వెంటే వెళ్లాడు. లాలాగూడ రైల్వేబ్రిడ్జి వద్దకు చేరుకోగానే తండ్రి కళ్లెదుటే శరణప్ప వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అటు ఇంట్లో ఉదయం 9.30 దాటినా లక్ష్మి గది నుంచి బయటకు రాకపోవడంతో అత్త లోపలికి వెెళ్లి చూసింది. అప్పటికే లక్ష్మి మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. లక్ష్మి మృతిపై లాలాగూడ పోలీసులు, శరణప్ప ఆత్మహత్యపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
