Advertisement

కన్నీరు పెట్టిన బొత్స సత్యనారాయణ

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ, విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. గురువారం గరివిడిలో ఈ సమావేశం నిర్వహించారు. ఇటీవల పార్టీ మారిన ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ (చిన్న శ్రీను)తో పార్టీకి ఉన్న అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ సమయంలో నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తండ్రి కంటతడి పెట్టడం చూసి చలించిపోయిన ఆయన కుమార్తె బొత్స అనూష వెంటనే ఆయనను ఓదార్చారు.

ఆపై తనను తాను సముదాయించుకున్న బొత్స సత్యనారాయణ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. “వ్యక్తులు రావొచ్చు, పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం పని చేయాలి. వైఎస్ జగన్ ఆశయాల కోసం అందరం కలిసి పనిచేద్దాం. ఈ కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను” అని బొత్స భరోసానిచ్చారు.

Advertisement
Advertisement