Advertisement

మళ్లీ ప్రజల్లోకి జగన్‌.. 2027లో పాదయాత్రకు సన్నాహాలు

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రజా యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్రపై ఆయన తాజాగా స్పష్టతనిచ్చారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో పాదయాత్ర 2.0పై స్పష్టమైన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2027) సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని ఆయన పేర్కొన్నారు. 2029లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ యాత్ర రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది.

వైఎస్‌ జగన్‌కు పాదయాత్రలు కొత్తేమీ కాదు. గతంలో 2017 నవంబర్‌ 6న ఆయన చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ వైఎస్సార్‌సీపీ రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత కీలక మలుపుగా నిలిచింది. ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రారంభమైన ఆ యాత్ర.. సుమారు 341 రోజులపాటు సాగింది. మొత్తం 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు నడిచి, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,516 గ్రామాలను కవర్ చేస్తూ కోట్ల మంది ప్రజలను కలుసుకున్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తాము అధికారంలోకి వస్తే అమలు చేసే ‘నవరత్నాలు’ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ పాదయాత్ర విజయవంతం కావడంతోనే 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 స్థానాలతో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సరిగ్గా అదే సెంటిమెంట్‌తో, అదే వ్యూహంతో మరోసారి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సన్నద్ధమవుతున్నారు.

Advertisement
Advertisement