Advertisement

స్థానిక పోరుపై సీఎం చంద్రబాబు డ్రామాలు: వైఎస్ జగన్‌

అమరావతి: రాష్ట్రంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ చంద్రబాబు మరోసారి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

కోర్టులో వీగిపోయే అంశాలపై ముందుకెళ్తూ, ఆ సాకుతోనే ఎన్నికలను వాయిదా వేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ద్వారా ఇప్పటికే లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయా అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎన్నికలు సాఫీగా జరిగే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, జైళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. రోజుకో డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే గెలుపు మనదేనని, ఒకవేళ జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడుతామని, ఇది కురుక్షేత్ర సంగ్రామం లాంటిదని జగన్ తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement